తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన

Mar 10,2024 21:30 #Mangalagiri, #Water Problem

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద మహిళలు ఆదివారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమకు నాలుగు రోజులుగా నీరు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పట్టణం మొత్తం నీరు వస్తున్నా టిడ్కో గృహాలకు మాత్రం ఇవ్వడంలేదని తెలిపారు. నాలుగు రోజులు సక్రమంగా వస్తే మరో నాలుగు రోజులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలుండే టిడ్కో గృహాల వద్ద నీటి సమస్యను అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని వాపోయారు. నీటి సమస్య కారణంగా తమ పిలలను పాఠశాలలకు పంపలేకపోతున్నామని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ముందస్తు సమాచారమైనా ఇవ్వకుండా నీటిని ఆపేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. నీళ్ల కోసం రోజు వారి పనులను కూడా మానుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️