తాగునీరు ఇప్పించండి- ఖాళీ బిందెలతో మహిళల నిరసన

Feb 27,2024 20:23 #karnool, #Water Problem

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ :అనంతపురం నగరంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఈ మేరకు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం నిరసన తెలిపారు. ప్రధాన గేటు ఎదుట బైఠాయించి అధికారులకు, పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం గేట్లను తోసుకుంటూ కమిషనరేట్‌లోకి దూసుకెళ్లారు. మహిళలకు మద్దతుగా ఈ ఆందోళనలో పురుషులు కార్యాలయం గేట్లను దూకి లోనికి ప్రవేశించారు. పోలీసులు అక్కడకు చేరుకుని గేట్లను మూసివేశారు. దీంతో మహిళలు గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు హరిత, బాబా ఫకృద్దీన్‌ మాట్లాడుతూ.. అనంతపురంలో నెలల తరబడి తాగునీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. పాతూరు, శారద నగర్‌, విజయనగర్‌ కాలనీ, బుడ్డప్పనగర్‌, నవోదయ కాలనీ తదితర ప్రాంతాల్లో నెల రోజులుగా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టింకోకపోవడం బాధ్యతా రాహిత్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌ హరిత భర్త జయరాం నాయుడు మాట్లాడుతూ అధికారులు, పాలకులకు పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై లేదని విమర్శించారు. మోటార్లను మరమ్మతు చేయించడం, కొత్త మోటార్లను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కార్పొరేషన్‌ వద్ద డబ్బులు లేవంటే తామే ప్రజలతో బిచ్చమెత్తి ఇస్తామని అన్నారు. ఈ సమస్యపై కమిషనర్‌ మేఘ స్వరూప్‌ స్పందించి ఆందోళనకారులతో మాట్లాడారు. ఇప్పటికే నగరంలో నీటి సరఫరా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే నీటి ట్యాంకర్లను పంపుతామని హామీ ఇచ్చారు. ఈ హామీతో మహిళలు ఆందోళన విరమించారు.

➡️