తాడిపత్రిలో పైప్‌లైన్‌ వివాదం

Mar 2,2024 21:45 #Pipelines, #tadipatri

– పెన్నానదిలో టిడిపి, వైసిపి నేతల మధ్య మాటలయుద్ధం

– పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌ :అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తాగునీటి పైప్‌లైన్‌ వివాదం రాజుకుంది. గత రెండు రోజులుగా టిడిపి, వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు గ్రూపుల వారు శనివారం పెన్నానదిలోని నీటి సరఫరా బోర్ల వద్దకు వెళ్లారు. తాము అభివృద్ధి చేస్తున్నామంటే.. లేదు తామే అభివృద్ధి చేస్తున్నామంటూ ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు గ్రూపులను అక్కడి నుంచి పంపి వేయడంతో సమస్య కాస్త సద్దుమణిగింది. తాడిపత్రి పెన్నా నది నుంచి మున్సిపాల్టీకి నీరు సరఫరా చేసే 21 బోర్లకు సంబంధించిన పైపులు గతంలో వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి తన సొంత నిధులతో మరమ్మతులు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ పనులను పరిశీలించేందుకు శనివారం ఉదయం టిడిపి కౌన్సిలర్లు పెన్నా నది వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడికి వైసిపి కార్యకర్తలు చేరుకుని.. పైపుల మరమ్మతు పనులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చేయిస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఖర్చును తామే భరిస్తున్నామని తెలిపారు. జెసి.ప్రభాకర్‌ రెడ్డి చేస్తున్న గొప్ప ఏమీ లేదంటూ ఆయనకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు నినాదాలు చేశారు. దీంతో టిడిపి నాయకులు ప్రతిగా వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి డిఎస్‌పి గంగయ్య తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. అభివృద్ధిని అడ్డుకోవద్దు : జెసి.ప్రభాకర్‌రెడ్డిఅభివృద్ధి చేస్తామంటే వైసిపి నేతలు అడ్డుకోవడం సరికాదని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టిడిపి, వైసిపి నేతల మధ్య ఘర్షణ అనంతరం పెన్నా నది పరివాహక ప్రాంతంలోని అరబిందో పంప్‌హౌస్‌ వద్దకు జెసి.ప్రభాకర్‌ రెడ్డి చేరుకున్నారు. అధికారులు కూడా అభివృద్ధికి సహకరించాలన్నారు.

➡️