తుపాను బాధితులకు రూ.25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు

బాపట్ల: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని కాలనీ వాసులు తమ బాధను చంద్రబాబు దఅష్టికి తీసుకెళ్లారు. కాలనీలో రహదారి లేక రోజులు తరబడి బురదలోనే గడిపామని స్థానికులు వాపోయారు. ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని కాలనీ వాసులు ఆరోపించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ”ఎస్టీ కాలనీలో ఎక్కడ చూసినా వరద నీరే. నాలుగు రోజులు మీరంతా నీళ్లలోనే ఉన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోనే ఇంత దారుణ పరిస్థితులు ఉండటం దుర్మార్గం. టిడిపి తరఫున ఒక్కో ఇంటికి 5వేల సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.25వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి. గత ఎన్నికల్లో టిడిపికి ఓటు వేశారనే కాలనీ వాసులపై కక్షగట్టారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

➡️