దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా కొనసాగించాలి

Mar 9,2024 21:33 #john wesly, #speech

– మతోన్మాద బిజెపిని ఓడించాలి

– డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు జాన్‌వెస్లీ

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి: మతోన్మాద బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడుకోవాలని దళిత్‌ సోషన్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు జగ్గుల జాన్‌వెస్లీ అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ‘దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా కొనసాగించాలి-మత స్వేచ్ఛను- మత సామరస్యాన్ని కాపాడాలి’ అనే అంశంపై భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా కన్వీనర్‌ ఎండి.ఆనంద్‌బాబు అధ్యక్షతన కర్నూలు ఎంపిపి హాలులో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జాన్‌వెస్లీ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. మతం మారారు కాబట్టి దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా గుర్తించడానికి వీల్లేదని చెబుతున్నారని అన్నారు. కుల వ్యవస్థ ఉండాలని, రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పే శక్తులను ఓడించాలని కోరారు. మత మార్పిడిని వ్యతిరేకిస్తూ ఐదు రాష్ట్రాల్లో చట్టాన్ని తీసుకొచ్చారని, బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే మత మార్పిడి నిషేద చట్టాన్ని కేంద్రంలో తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను నిలదీసే వైపుగా ఉద్యమించాలని, రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే దళితులకు, మైనార్టీలకు హక్కులుండవని, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని, అసమానతలకు అది కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. దళితులు అంటరాని వాళ్లుగానే ఉండాలని చినజీయర్‌ స్వామి అన్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయనపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి లాయర్స్‌ ఫోరం అధ్యక్షులు ఎగ్గోని జయరాజు మాట్లాడుతూ.. పేరును బట్టి సమాజంలో వివక్షకు గురి చేస్తున్నారని, అందరూ సమానమే అని చెబుతూ దళిత క్రైస్తవులు ఎస్‌సిలు కాదని చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సామాజిక విశ్లేషకులు కొమ్ముపాలెం శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే మతం అని కేంద్రం అంటోందని, జెండాను కూడా మార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమావేశంలో కర్నూలు సెక్యులర్‌ ఫోరం నాయకులు డి.గౌస్‌ దేశారు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు దేవసహాయం, భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు పిఎస్‌.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️