నూతన విద్యా విధానంతో పేదలకు విద్య దూరం

Dec 11,2023 08:15 #sadassu, #utf

-సమాజ మార్పులో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి

-యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పిడిఎఫ్‌ పూర్వ ఫ్లోర్‌ లీడర్‌ బాలసుబ్రమణ్యం

-డిఎస్‌సి వెంటనే ప్రకటించాలని తీర్మానం

ప్రజాశక్తి- ఏలూరు అర్బన్‌కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తూ పేదలకు విద్యను దూరం చేస్తోందని పిడిఎఫ్‌ పూర్వ ఫ్లోర్‌ లీడర్‌ విబి.బాలసుబ్రమణ్యం అన్నారు. సమాజ మార్పులో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఏలూరులోని చలసాని గార్డెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) 49వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం చివరి రోజు ఆదివారం ప్రతినిధుల సభ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ శాస్త్రీయ విద్యనందించే దిశగా మంచి బడికి పునాదులు వేయాలన్నారు. కేరళ తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికీ ఉచిత నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలని, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వ జోక్యం పెరగాలని, వాటిని నియంత్రించాలని అన్నారు. నూతన విద్యావిధానం పేరుతో కేంద్రం నుండి వచ్చిన పాఠ్య పుస్తకాలనే బోధించడం తగదన్నారు. ఈ పాఠాలు వాస్తవ చరిత్రను కప్పిపుచ్చి అవాస్తవాలు విద్యార్థుల మెదడులో చొప్పిస్తున్నాయని పేర్కొన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. మంచి పిఆర్‌సి ఇస్తామని, సిపిఎస్‌ రద్దు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, డిఎ బకాయిలు లేకుండా చెల్లిస్తామని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. పాత పెన్షన్‌ పునరుద్ధరించకపోగా మరింత ప్రమాదకరంగా జిపిఎస్‌ తీసుకొచ్చారన్నారు. వీటిని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కార్యాచరణ రూపొందించి భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. సంఘం కోశాధికారి బి.గోపీమూర్తి ఆర్థిక వేదికను, ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు ఎం.కుమార్‌రాజా పత్రిక నివేదికను, ఆడిట్‌ కన్వీనర్‌ మల్లేశ్వరరావు ఆడిట్‌ నివేదికను, ప్రచురణ కమిటీ చైర్మన్‌ హనుమంతరావు ప్రచురణ నివేదికను, సహాధ్యక్షులు ఎ.కుసుమకుమారి మహిళా ఉద్యమ నివేదికను ప్రవేశపెట్టారు.పలు తీర్మానాలు ఆమోదండిఎస్‌సి వెంటనే ప్రకటించాలని, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఐఆర్‌ ప్రకటించాలని, పాఠశాల స్థాయి పరీక్షా విధానాన్ని సమీక్షించాలని తదితర తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 26 జిల్లాల నుండి వచ్చిన యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️