పంచ గ్రామాల భూ సమస్యపై ర్యాలీ

Feb 5,2024 07:51 #land issuses, #Rally

ప్రజాశక్తి – వేపగుంట, సింహాచలం (విశాఖపట్నం):సుమారు 25 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలంటూ ఆదివారం భారీ ర్యాలీ జరిగింది. విశాఖ వేపగుంట జంక్షన్‌ ముత్యాలమ్మ అమ్మవారి గుడి నుంచి సింహాచలం తొలిపావంచా వరకూ స్థానికులు ర్యాలీ నిర్వహించారు. పంచగ్రామాలకు చెందిన యువత దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. తమపట్ల పాలకులు అవలంబిస్తున్న మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ఫ్లకార్డులు చేబూని పెద్దపెట్టున నినాదాలు చేశారు. రానున్న కాలంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ తమ భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల యజమానులను హక్కుదారులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. 1903 సర్వే సెటిల్‌మెంట్‌ (గిల్‌మెన్‌) రికార్డు ఆధారంగా భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోవడంతో తాము కొత్తగా ఇళ్లను నిర్మించుకోలేకపోతున్నామని, కుటుంబ అవసరాలకు అమ్ముదామన్నా కుదరడం లేదని వాపోయారు. ర్యాలీ అనంతరం సింహాచలం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టివి కృష్ణంరాజు, విబిఎన్‌ ప్రతాప్‌, కెఆర్‌కె ప్రసాద్‌, బి శంకర్రావు, వి హనుమంతరావు పాల్గొన్నారు.

➡️