పిఠాపురం నుంచే పవన్‌కల్యాణ్‌ ప్రచారం

Mar 22,2024 22:46 #campaign, #janasena pawan, #pitapuram

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రానున్న సాధారణ ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రారంభించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు అంశంపై పార్టీ నేతలతో పవన్‌కల్యాణ్‌ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఠాపురం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. తొలుత వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరుగుతుందన్నారు. తొలి మూడు రోజులు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడంతో పాటు, నియోజకవర్గ ముఖ్యనాయకులు, మండలస్ధాయి నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాను పోటీ చేస్తున్న స్ధానం కావడంతో పిఠాపురంపై వైసిపి కుట్రలు పన్నుతోందని, ప్రతి దశలోనూ ఎన్‌డిఎ కూటమి నేతలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనల గురించి టూర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేంధర్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనరు కల్యాణం శివ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️