పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Mar 7,2024 21:40 #Nara Lokesh, #speech

– అధికారంలోకి వస్తే అక్రమ కేసులు ఎత్తేస్తాం

– శంఖారావం సభలో నారా లోకేష్‌

ప్రజాశక్తి – హిందూపురం: టిడిపి అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. అన్ని నియోజకవర్గాలకు నీరిచ్చి సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. శంఖారావం 2వ విడత యాత్ర శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం ప్రారంభమైంది. మడకశిరలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ‘వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. చాలా మందిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. టిడిపి అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్నింటినీ ఎత్తేస్తాం. కేసులు బనాయించిన అధికారులపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తాం’ అని అన్నారు. గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం అరాచక పాలనను సాగిస్తోందన్నారు. ఎలాంటి విజన్‌ లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌హన్‌రెడ్డి అని, గంజాయి, ఇసుక, మద్యం అక్రమాలకు పాల్పడుతూ డబ్బులను దోచుకోవడంలో ఆయనకు విజన్‌ ఉందని విమర్శించారు. ఆయన మొదటిసారి విశాఖకు వెళ్తే అక్కడ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకైంది, రెండోసారి ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయన్నారు. వైసిపి పాలనలో నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు బతకడం కష్టంగా మారిందన్నారు. బాబారు వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు..? చంపించిందెవరు..? సూత్రధారులు, పాత్రధారులు ఎవరు..? అన్న వాటిపై ఇంతవరకు విచారించకపోవడంలో ముఖ్యమంత్రి ఆంతర్యం ఏమిటంటూ స్వయానా ఆయన చెల్లి సునీత ఆరోపిస్తున్న ప్రశ్నలకు జగన్‌మోహన్‌రెడ్డి సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లాలో అనేక పాపాలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… హిందూపురంలోనూ అక్రమాలు చేసేందుకు తరచూ ఇక్కడికి వస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తికి హిందూపురం ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారధి, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, టిడిపి అభ్యర్థి సునీల్‌కుమార్‌, ఎమ్మెల్సీ రాంభూపాల్‌ రెడ్డి, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌తో పాటు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️