పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

Dec 11,2023 21:49 #Dharna
  • 20 నుంచి సమ్మె
  • సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాలో వక్తలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యలు పరిష్కారానికి పోరాటలే మార్గమని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ నెల 20వ తేది నుంచి నిర్వహించే సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్‌ చేయాలని, ఎంటిఎస్‌, హెచ్‌ఆర్‌ఎ, డిఎ, అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం ‘చలో విజయవాడ’ కార్యక్రమం ధర్నా చౌక్‌లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(జెఎసి) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలాల నుంచి ఉద్యోగులు వందల సంఖ్యలో తరలివచ్చారు. జెఎసి అధ్యక్షులు బి కాంతారావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవడం లేదని విమర్శించారు.. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్య యత్నం చేసిన ఉపాధ్యాయుడు మల్లేష్‌ రాష్ట్రప్రభుత్వంపై ఐదు పేజీల చార్జీషీట్‌ విడుదల చేశారన్నారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే త్వరలోనే ఇంటికి వెళ్తుందన్నారు. ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఉద్యోగుల కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి వస్తే సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఒక్కదానిని కూడా పరిష్కరించలేదన్నారు. శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ కె ధనలక్ష్మి, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు బేబిరాణి, ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రమాదేవి, యుటిఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు, ఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాసరావు, ఎపిటిఎఫ్‌-1938 ప్రధాన కార్యదర్శి ఎస్‌ చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి ప్రసంగించారు. ఉద్యోగుల చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. జెఎసి నాయకులు నాయకులు శ్రీనివాస్‌, కళ్యాణి, గురువులు, అనిల్‌, జయరాజ్‌, వెంకట్రావు, నాగేశ్వరరావు, సునీత, చిన్నతల్లి, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డైరెక్టర్‌కు వినతిపత్రం

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమగ్ర శిక్ష డైరెక్టర్‌ బి శ్రీనివాసరావును కోరారు. ధర్నా అనంతరం సమగ్ర శిక్షకార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఉద్యోగుల సమ్యలు పరిష్కరించడంతో పాటు వెంటనే బకాయి వేతనాలను చెల్లించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో యుటిఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు, ఎపిటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి, ఎస్టియు ప్రధాన కార్యదర్శి హెచ్‌ తిమ్మన్న ఉన్నారు.

 

➡️