పోరాట యోధుడు ‘అప్పారి’

Mar 22,2024 22:59 #ex mlc, #speech

– వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు

ప్రజాశక్తి-నెల్లూరు: ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు అప్పారి వెంకటస్వామి అని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. నెల్లూరు యుటిఎఫ్‌ భవన్‌లో ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు వివి.శేషులు అధ్యక్షతన అప్పారి వెంకటస్వామి 23వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా రంగంలోనూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలోనూ ఆనాటి ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ఎండగట్టడానికి చారిత్రాత్మక అవసరంగా యుటిఎఫ్‌ ఆవిర్భావం జరిగిందని తెలిపారు. ఆవిర్భావ ప్రధాన కార్యదర్శిగా సంఘ నిర్మాణంలోనూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలోనూ, విద్యారంగ పరిరక్షణలోనూ, రాజీలేని సమరశీల పోరాటాలు నడుపుతూ 25 సంవత్సరాల పైబడి సంఘానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అప్పారి అని కొనియాడారు. సంఘం కోసం తన ఉద్యోగాన్ని సైతం వదిలేశారని గుర్తు చేశారు. ఆయన చూపిన ఆదర్శ మార్గంలో సమాజ అభివృద్ధికి, విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నవకోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జివి చలపతి శర్మ, రాష్ట్ర నాయకులు వి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️