ప్రజాస్వామ్యం అపహాస్యం

Dec 20,2023 21:45 #cpm v srinivasarao, #press meet

-ఎంపిల సస్పెన్షన్‌ను నిరసనగా 22న ‘ఇండియా’ నిరసనలు

-పార్లమెంట్‌లో మోడీ సర్కారు నిరంకుశత్వంపై నోరెత్తని వైసిపి, టిడిపి

-స్టీల్‌ప్లాంట్‌లోకి బడా కార్పొరేట్లు జరబడకుండా పోరాటం : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరోదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 141 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలను సస్పెండ్‌ చేసి మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ చర్యకు నిరసనగా 22వ తేదిన దేశ వ్యాప్తంగా నల్లజెండాలు, బెలూన్లతో ఇండియా వేదికలోని పార్టీలు నిరసనలు, ఆందోళనలు చేయనున్నాయని తెలిపారు. ఆయన విశాఖలోని ఎన్‌పిఆర్‌ భవన్‌లో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడుతో కలిసి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా వైసిపి, టిడిపిలు నోరెత్తడం లేదని, వైసిపి పూర్తిగా బిజెపితో అంటకాగుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్తున్న టిడిపి… దేశ చట్టసభలో మోడీ నిరంకుశత్వంపై మాట్లాడకపోవడంపై ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలూ పార్లమెంట్‌లో బిజెపికి మద్దతునివ్వడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలు వైఖరి మార్చుకుని 22న ఇండియా వేదిక ఆధ్వర్యాన జరిగే ఆందోళనల్లో ఆ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌కు స్టేక్‌ హోల్డర్‌లు కార్మికులేవిశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కార్మికులే మొదటి స్టేక్‌ హోల్డర్‌లని శ్రీనివాసరావు అన్నారు. వారిని విస్మరించి అదానీ, జిందాల్‌, టాటాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు, సంప్రదింపులు ఏమిటని ప్రశ్నించారు. వైసిపి, టిడిపికి చెందిన 25 ఎంపిలు పార్లమెంట్‌లో గళం వినిపించాలని కోరారు. సెయిల్‌ కంపెనీ ద్వారా మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నడిపించాలని, ఎన్‌ఎండిసి ద్వారా బగ్గు, ఐరన్‌ ఓర్‌ అందేలా కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాలపై రెండు రోజుల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రకటన చెయ్యాలని కోరారు. జిందాల్‌, టాటా, అదానీ వంటి బడా కార్పొరేట్‌ కంపెనీలు ప్లాంట్‌లోకి జరబడితే కర్మాగారం నిశనమవుతుందని ఆందోళన చెందారు. స్టీల్‌ప్లాంట్‌కు నష్టం రాకుండా కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి సిపిఎం పోరాడుతుందన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస నిధులేవీ?రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసమే నిధులను కేంద్రాన్ని అడగడం సముచితం కాదని వి. శ్రీనివాసరావు అన్నారు. నిర్వాసితుల పునరావాసం కోసం సుమారు రూ.33 వేల కోట్ల వరకూ రావాల్సి ఉండగా, కేవలం రూ.4 వేల కోట్లే వచ్చాయని, మిగతా నిధుల కోసం కూడా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో పంటలు పోయిన ఆవేదనలో రైతులు, బాధిత ప్రజలు అల్లాడుతుంటే నష్ట అంచనాల నివేదికలు తయారు చేయాల్సిన సచివాలయ, రెవెన్యూ ఉద్యోగులను అంగన్‌వాడీల ఉద్యమంపైకి ఎగదోస్తున్న జగన్‌ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. అక్కచెల్లెమ్మలంటూ 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్‌ నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను అర్ధరాత్రి సమయంలో సచివాలయ, రెవెన్యూ ఉద్యోగులతో పగలగొట్టించడం సిగ్గుచేటన్నారు. అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీని ఏళ్ల తరబడి మూసెయ్యడంతో అప్పుల బాధ తాళలేక ఒక కార్మికుడు తనకు చావే శరణ్యమంటూ, ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ రెండు రోజుల క్రితం హైకోర్టునాశ్రయించడం బాధాకరమని పేర్కొన్నారు. సిఎం జగన్‌ ఈ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పాయకరావుపేట, తునిలో వస్తున్న బల్క్‌డ్రగ్‌ ఫ్యాక్టరీలు కాలుష్యం వెదజల్లేవేనని, ప్రజలు, రాజకీయ పార్టీలు వీటిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మొండితనానికి పోకుండా ప్రభుత్వం వీటిని ఆపాలని డిమాండ్‌ చేశారు. సీలేరు ప్రాంతంలో హైడల్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే గిరిజనులను బలివ్వడం తప్ప, మరొకటి జరగదని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతుల్లేవన్నారు. అయినా, ఇక్కడ అటవీ శాఖ అధికారులు సర్వేకు ప్రయివేట్‌ వాళ్లకు సహకరిస్తున్నారని, తక్షణం మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️