ఫిబ్రవరి 8న దళిత సింహ గర్జన

Jan 8,2024 08:07 #harsha kumar, #speech

-పది లక్షల మందితో రాజమహేంద్రవరంలో సభ : హర్ష కుమార్‌

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం:వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఫిబ్రవరి ఎనిమిదిన దళిత సింహగర్జన ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎంపి జివి హర్ష కుమార్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలో సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దళితులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. డాక్టర్‌ సుధాకర్‌తో పాటు అనేకమంది దళితులపై దాడులు జరిగాయని, మరికొందరు వేధింపులకు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అమలు చేయాల్సిన 27 సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు రిజర్వేషన్‌లో కేటాయించాల్సిన మెడికల్‌ కాలేజీ సీట్లునూ అమ్ముకుంటోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు చేస్తున్న ద్రోహాన్ని దళిత సింహం గర్జన సభలో ప్రజలకు వివరిస్తామన్నారు. 56 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ సభకు సుమారు పది లక్షల మందికి పైగా దళితులు హాజరవుతారని తెలిపారు.

➡️