బాబు, పవన్‌లకు బిజెపి అధిష్టానం పిలుపు ?

Feb 19,2024 08:05 #chandrababu, #meet, #modi, #pawan

-రేపు అందుబాటులో ఉండాలని సూచన

21న పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి పొత్తుల అంశం కొలిక్కి రానున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు మరోసారి బిజెపి అధిష్టానం నుండి పిలుపు వచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రేపు (మంగళవారం) వారిద్దరిని అందుబాటులో ఉండాలని బిజెపి నేతలు కోరారు. అవసరమైతే ఆ రోజు ఢిల్లీకి రావాల్సిఉంటుందని బిజెపి నాయకత్వం సూచించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ నెల 21న ఎన్‌డిఎ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశలో ప్రకటన వెలువడి ఉండాల్సిందని, బిజెపి జాతీయ కౌన్సిల్‌ సమావేశాల నేపథ్యంలో ఆలస్యమైందని అంటున్నారు. బిజెపితో పొత్తు ఖాయమని తేలడంతో సీట్ల సర్దుబాటు గురించి టిడిపి, జనసేన నేతల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. వైసిపి నుండి వచ్చే నేతలను చేర్చుకునే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?

విశ్వసనీయ సమాచారం మేరకు బిజెపి 10 ఎమ్మెల్యే, ఆరు ఎంపి సీట్లు అడుగుతోంది. వీటిల్లో రాజమండ్రి, నరసాపురం, రాజంపేట ఎంపి సీట్లు ఇచ్చేందుకు టిడిపి సుముఖత వ్యవక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన విషయానికి వస్తే మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి, తిరుపతి పార్లమెంటు సీట్లు అడుగుతుండగా, టిడిపి నుంచి మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం ఉందని సమాచారం. తప్పని సరైతే అనకాపల్లి సీటు కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే సీట్ల విషయానికి జనసేన 28 నుంచి 33 స్థానాలు కోరుతున్నట్లు తెలిసింది.

అభద్రతలో సీనియర్లు : బుజ్జగించే పనిలో పార్టీ అధిష్టానం

పొత్తుల్లో భాగంగా ఎవరి సీటు త్యాగం చేయాల్సి వస్తోందోననే భయం టిడిపి సీనియర్‌ నేతల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని సీనియర్లు పట్టుపడుతున్నారు. ఇదే సందర్బంలో టిడిపి సిట్టింగ్‌ స్ధానాలను బిజెపి, జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్‌ శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్‌ ముగిసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగు స్థానాలను త్యాగం చేసేందుకు టిడిపి సీనియర్లు అంగీకరించడం లేదని తెలిసింది. వారికి నచ్చజెప్పే పనిలో టిడిపి నాయకత్వం ఉంది.

➡️