బాబు మాటలనే సునీత మాట్లాడారు- సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చంద్రబాబునాయుడి మాటలనే వైఎస్‌ సునీత మాట్లాడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని గుర్తుచేశారు. అప్పుడు నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ఏనాడైనా నిలదీశారా అని ప్రశ్నించారు. నాడు వైసిపికి కడపలో పూర్తి మెజారిటీ వున్నా వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించింది చంద్రబాబునాయుడు, బిటెక్‌ రవి కాదా అని ప్రశ్నించారు. అలాగే వైఎస్‌ విజయమ్మను ఓడించేందుకు వివేకానందరెడ్డిని దగ్గరకు తీసుకున్నారని అన్నారు. అలాంటి వారితో సునీత ఇప్పుడు ఎలా జట్టు కడతారని ప్రశ్నించారు. ఢిల్లీలో వైఎస్‌ సునీత మాట్లాడిన తీరు, కృతజ్ఞతలు చెప్పిన తీరును బట్టి ఆమె ఎవరి ప్రతినిథో అర్థం అవుతోందన్నారు. సునీత మాటల వెనుక పెద్ద కుట్ర వుందని విమర్శించారు. ఆమె చంద్రబాబునాయుడు చేతి పావులా మారారని అన్నారు. ఈ కేసులో వైఎస్‌ సునీత కుటుంబసభ్యుల మీదనే అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి జనసేన అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీగా మారిపోయిందని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌ 24 సీట్లతో ఏమి రాజకీయం చేస్తారో చెప్పాలని అన్నారు.

➡️