బిజెపి కోసం తమ్ముళ్లకు మొండిచెయ్యి

Mar 15,2024 22:55 #nirasana, #TDP

– అధినేత తీరుపై టిడిపి శ్రేణుల నిరసనాగ్రహం

– పోటీ చేసి తీరుతామంటున్న జవహర్‌, ఎన్‌విఎస్‌ఎన్‌ వర్మ

ప్రజాశక్తి – యంత్రాంగం:టిడిపికి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను కేటాయించడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు టిటిడి అధినేత చంద్రబాబు నట్టేట ముంచుతున్నారని, బిజెపిని తలకు ఎత్తుకోవడంతో తాము సీటు కోల్పోవాల్సి వస్తుందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బిజెపికి సీటు ఏలా కేటాయిస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ కుట్రలకు తమ కుటుంబం బలైపోతోందని టిడిపి మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ, లక్ష్మీదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టికెట్‌ కేటాయించకుండా బిజెపి అభ్యర్థికి కేటాయించడం పట్ల వారు తీవ్ర అసహనానికి గురయ్యారు. టికెట్టు కేటాయించకపోయినా పోటీ చేసి తీరుతామని వారు హెచ్చరించారు. గుండ దంపతులకు మద్దతుగా శ్రీకాకుళంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎంపి రామ్మోహన్‌ నాయుడు ఇంటి వద్ద బైఠాయించారు. ధర్మవరం అసెంబ్లీ టికెట్‌ను పరిటాల శ్రీరామ్‌కు కాకుండా పొత్తుల్లో భాగంగా బిజెపికి ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టం పనిచేసిన వారిని కాదని బిజెపి అభ్యర్థికి సీటు కేటాయించడం పట్ల అనంతపురంలోని సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారథి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

పోటీ నుంచి తగ్గేదేలే

రాబోయే ఎన్నికల్లో పోటీ నుంచి తగ్గేదేలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎన్‌.వర్మ, మాజీ మంత్రి కెఎస్‌.జవహర్‌ స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్లు ఖరారయ్యాయి. దీంతో అధిష్టానం నిర్ణయంపై వర్మ, జవహర్‌ తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారు. అధిష్టానం పిలుపు మేరకు శనివారం చంద్రబాబును కలిసి కార్యకర్తల అభిప్రాయాన్ని వెల్లడిస్తానని వర్మ తెలిపారు.

తూర్పు కాపులకు అన్యాయం

విజయనగరం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం కిమిడి కళా వెంకటరావు, చీపురుపల్లిలో కిమిడి నాగార్జునకు టికెటు కేటాయించకపోవడం పట్ల రాజాం నియోజకవర్గ నాయకులు నిరసన తెలిపారు. రాజాంలోని సూర్యదుర్గ కల్యాణ మండపంలో రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాలకు చెందిన టిడిపి నాయకులు సమావేశమయ్యారు. ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాల్లో తూర్పు కాపులకు న్యాయం జరగలేదని, కళా వెంకటరావు పట్ల చంద్రబాబు వైఖరి సమంజసంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకర్గం నుంచి తన కుమారుడు దినేష్‌రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి టికెట్‌ కేటాయించడం తగదని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు పునరాలోచన చేయాలని, లేకుంటే కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు.

జనసేనకు అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజీనామా

జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరుచూరి భాస్కరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కోసం రోజుల తరబడి వేచి చూసినా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును జనసేన అభ్యర్థి పోతిన వెంకట మహేష్‌కు కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు చిట్టినగర్‌ సెంటర్‌లో ఆందోళన చేశారు.

ఏలూరు బిజెపిలో తిరుగుబాటు

ఏలూరు ఎంపి టికెట్‌ గారపాటి సీతారామాంజనేయచౌదరి (తపన చౌదరి)కి ఇవ్వాల్సిందేనని పార్టీ అధిష్టానానికి బిజెపి నేతలు, కార్యకర్తలు అల్టిమేటం జారీ చేశారు. ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో కార్యకర్తలు, నాయకులతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించి, తాను లోకల్‌ వ్యక్తినని, తనకే టికెట్‌ కేటాయించాలని అధిష్టానికి అల్టిమేటం జారీ చేశారు.

➡️