బిజెపి పాలనలో లౌకికతత్వానికి విఘాతం

Mar 13,2024 23:42 #CAA, #CAA nirasana
  •  సిఎఎకు వ్యతిరేకంగా నిరసనలు

ప్రజాశక్తి – యంత్రాంగం : పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం పేరుతో దేశప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి చర్యలను వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశంలోని లౌకిక తత్వానికి, మతసామరస్యానికి విఘాతం కలిగించే విధంగా పాలన సాగిస్తుందని పలువురు విమర్శించారు. నెల్లూరులో ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద వామపక్షాలు, పౌరహక్కుల సంఘం, ప్రజాసంఘాల సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ.. 2019 డిసెంబర్‌ 9న పౌరసత్వం సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌, సిఎఎ చట్టాల అమలుకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరగడంతో చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసిందని తెలిపారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో తిరిగి సిఎఎను ముందుకు తీసుకొచ్చిందని విమర్శించారు. దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళించడానికి ఇటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచించి రాబోవు ఎన్నికల్లో బిజెపి, ఆ పార్టీకి మద్దతు తెలిపే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌ రఘు పాల్గొన్నారు.

➡️