బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..వారికే కాదు రాష్ట్రానికే అరిష్టం..! : సిపిఐ రామకృష్ణ

కర్నూల్‌: టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. దేశంలో బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు నడుస్తున్నాయి.. అమరావతికి అన్ని రాజకీయపార్టీలు ఆమోదం తెలిపాయి.. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్‌ మూడు రాజధానులు డ్రామా ఆడారు అని దుయ్యబట్టారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అంటున్నారని ఫైర్‌ అయ్యారు.మరోవైపు.. సీఎం వైఎస్‌ జగన్‌ పని అయిపోయింది.. పరిపాలనకు జగన్‌ అనర్హుడు అంటూ వ్యాఖ్యానించారు. కర్నూలు న్యాయ రాజధాని కోసం ఢిల్లీకి ప్రపోజల్‌ కూడా పంపలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ను జనం పంపించారు.. ఏపీలో జగన్‌ ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతులు రోడ్డు ఎక్కకుండా.. కేంద్రం అనేక ఆంక్షలు పెట్టింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతు ఉద్యమం ఆగదు అన్నారు. మోడీ రైతులకు ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయలేదని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 156 లక్షల కోట్ల అప్పులు చేసింది.. పదేళ్లలో దేశాన్ని ప్రధాని అప్పుల పాలు చేశాడు అని విమర్శలు గుప్పించారు.

➡️