‘మా అజెండా ప్రజా సంక్షేమం’ : చంద్రబాబు

Mar 17,2024 18:05 #Chandrababu Naidu, #speech

చిలకలూరిపేట: ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో బప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.” ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు జట్టు కట్టాయి. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మా జెండాలు వేరే కావచ్చు. మా అజెండా ఒక్కటే. సంక్షేమం. అభివఅద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రజల కోసం తపించే పవన్‌కల్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్లు, సమస్యలు అధిగమించాం. ఎన్డీయేలో భాగస్వాములయ్యాం. అనేక కార్యక్రమాలు చేశాం. 11 జాతీయ విద్యా సంస్థలను ఇక్కడ నెలకొల్పాం. అమరావతిని నిర్మాణానికి పునాదులు వేశాం. అది పూర్తయి ఉంటే, దేశంలో నెం.1గా మారేది. మూడు ముక్కల మాటలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. పోలవరాన్ని గోదావరిలో కలిపారు. సహజ వనరులు దోచేశారు. జె బ్రాండ్‌తో కల్తీ లిక్కర్‌ తెచ్చి అనేకమంది ప్రజలను బలితీసుకున్నాడు.పెట్టుబడులు తరిమేశాడు. ఐదేళ్లలో రోడ్లు లేవు.. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధేలేదు. ప్రజల గుండెల్లో మనశ్శాంతి లేదు. బంగారు రాష్ట్రాన్ని జగన్‌ చీకటిమయం చేశాడు. గతంలో లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశాడు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేశాడు. జగన్‌ అధికార దాహానికి బాబారు బలయ్యాడు.  ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాలి”అని అన్నారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..” 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. ముఖ్యమంత్రి జగన్‌ ఒక సారా వ్యాపారిగా మారారు. దేశమంతా డిజిటల్‌ ట్రాన్సక్షన్‌ చేస్తుంటే.. ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా.. ఈరోజు -3 శాతానికి దిగజారిపోయింది. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్‌ విర్రవీగుతున్నారు. ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం” అని పవన్‌ అన్నారు.

➡️