మూడు రైళ్లకు గమ్యస్థానం పొడిగింపు

Jan 13,2024 08:27 #opened, #Special Items

– ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేశాఖ పొడిగించిన గుంటూరు-విశాఖపట్నం వరకు నడిచే ఉదరు ఎక్స్‌ప్రెస్‌, నర్సాపురం-హుబ్లీ మధ్య నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్‌, నంద్యాల-రేణిగుంట వరకు నడుస్తున్న ప్రత్యేక రైళ్లను గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఆయన శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మూడు రైళ్ల సర్వీసుల పొడిగింపు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందన్నారు. రాష్ట్రానికి రైల్వే కేటాయింపుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.886 కోట్ల నుంచి రూ.8400 కోట్లకు పెంచినట్టు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన వందేభారత్‌ రైళ్లు దేశ వ్యాప్తంగా 41 ప్రారంభిస్తే రాష్ట్రం మీదుగా ఐదు వెళ్తున్నాయన్నారు. గత పదేళ్లలో 25,800 కిలో మీటర్ల ట్రాక్‌ అభివృద్ధి పనులు చేపట్టగా, రాష్ట్రంలో 371 కిలోమీటర్ల మేరకు కొత్త ట్రాక్‌ నిర్మాణం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని రైల్వే లైన్లు విద్యుద్దీకరణ చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ రామకృష్ణ, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️