మేత పోరంబోకు భూములు పంచాల్సిందే – పేదల భూపోరాటం

Mar 8,2024 21:40 #cpm dharna, #tirupathi

ప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌ :తిరుపతి జిల్లా వెంకటగిరి రెవెన్యూ పరిధిలోని మేత పోరంబోకు భూములను పంచాలని డిమాండ్‌ చేస్తూ పేదలు భూపోరాటం చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఆ భూములను ఆక్రమించారు. 150 మంది పేదలకు ఒకొక్కకరికి రెండు ఎకరాల చొప్పున భూములు పంచాలని డిమాండ్‌ చేశారు. ముళ్లకంపలను తొలగించి సుమారు 250 ఎకరాల్లో ఎర్రజెండాలు పాతారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, డివిజన్‌ నాయకులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడారు. వెంకటగిరి రూరల్‌ పరిధిలోని పెట్లూరు పంచాయతీ సర్వే నంబర్‌ ఒకటిలో 238 ఎకరాల 98 సెంట్లు, సర్వే నంబర్‌ 12లో 519 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. గత పదేళ్లుగా ఈ భూముల్లోకి పేదలు వెళ్లకుండా ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు అనేక పర్యాయాలు వినతిపత్రాలు అందజేశామని చెప్పారు. వనసంరక్షణ సమితులకు భూములు కేటాయించామని అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని, ఇవే సర్వే నంబర్లలో జగనన్న ఇళ్లకు ప్లాట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు భూములు పంచేంత వరకూ ఈ భూ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పద్మమ్మ, రమణయ్య పేదలు పాల్గొన్నారు.

➡️