మైనార్టీలను వేధించడానికే సిఎఎ- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) :మైనార్టీలను వేధించడానికే సిఎఎ చట్టం తీసుకువచ్చారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి విమర్శించారు. ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంఘం బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం, దేశాయిపేట పంచాయతీ సిలోన్‌ కాలనీలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రమాదేవి మాట్లాడుతూ… పేదలు, మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల మైనార్టీలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. దేశంలో ఉపాధి సమస్య ప్రధానంగా ఉందని, ఫలితంగా మహిళలు నామమాత్రపు వేతనాలకు పని చేయాల్సి వస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు సుభాషిణి పాల్గొన్నారు.

➡️