రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ద్రోహం : చలసాని

Feb 22,2024 08:09 #cpm dharna

ప్రజాశకి – రాజమహేంద్రవరం:ఆంధ్రరాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద పీపుల్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌, మానవ హక్కులకై పోరాడు సాధించు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని సిపిఎం నాయకులతో కలిసి చలసాని బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు, హక్కుల కోసం పార్టీలకతీతంగా యువత పోరాడాలని కోరారు. ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు దొరక్క రాష్ట్రం నుంచి వలసపోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర భవిష్యత్తును బిజెపికి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ రిలే నిరాహార దీక్షలకే కాకుండా మొదటి నుంచి ఎపి రాష్ట్ర హక్కులు సాధించుకునేందుకు సహకరిస్తున్న వామపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్‌, నాయకులు బి పవన్‌, రాజులోవ, డాక్టర్‌ చైతన్యశేఖర్‌, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్‌ టికె విశ్వేశ్వరరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎన్‌ రాజా, ట్యాక్సీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, ముస్లిం సంఘాల నాయకులు, విద్యార్థులు మద్దతు తెలిపారు.

➡️