రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరికీ తలవంచం: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎవరికీ తలవంచేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ”ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం, ఫార్ములా ఈ-రేస్‌, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ మధ్య ట్రై పార్టీ అగ్రిమెంట్‌ జరిగింది. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్‌ సదుపాయం కల్పించాలి. రేస్‌ ద్వారా టికెట్లు అమ్ముకొని లబ్ధిపొందాలని ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థ భావించింది. ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ అగ్రిమెంట్‌గా మార్చేశారు. రేస్‌కు సంబంధించి రూ.110 కోట్లు చెల్లించి అనుమతులు ఇప్పించాలని నిబంధన.రూ.55 కోట్లు చెల్లించారు.. ఇంకా రూ.55 కోట్లు చెల్లించాలని నోటీసు వచ్చింది. బిజినెస్‌ రూల్స్‌కు భిన్నంగా గత ప్రభుత్వం తప్పిదం చేసింది. రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టింది. ట్రాక్‌ కోసం రూ.20కోట్లు ఖర్చు పెట్టారు. హైదరాబాద్‌ రేసింగ్‌ లిమిటెడ్‌ రూ.35 కోట్లు ఖర్చు పెట్టింది. రేస్‌ సందర్భంగా వారం పది రోజులు రోడ్లు బ్లాక్‌ చేశారు. ఏజెన్సీ కంపెనీ మాత్రం టికెట్లు అమ్ముకొని వెళ్లిపోయింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఉండదు” అని వివరించారు.

➡️