రూ.115 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక

– జూన్‌ వరకూ అందించేందుకు చర్యలు

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడించారు. జూన్‌ ఆఖరు వరకు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, గ్రామీణ నీటిసరఫరా విభాగాల అధికారులతో సిఎస్‌ గురువారం సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణాలు చివరి దశకు వచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులన్నిటినీ పూర్తిస్థాయిలో నీటితో నింపాలని సూచించారు. బోర్‌ వెల్స్‌, ఇతర తాగునీటి వనరులకు సంబంధించి స్టోరేజీలకు మరమ్మతులు చేపట్టాలని, శివారు కాలనీలకు, ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. కుళాయిల ద్వారా రోజుకు ఒక్కసారైనా మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌ సెంటర్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు కూడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నీటి ఎద్దడి గల 1,354 ఆవాసాలకు జూన్‌ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. కరువు మండలాల్లో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మున్సిపల్‌ పరిపాలనా శాఖ కమిషనరు శ్రీకేశ్‌ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 47 పట్టణాల్లో రోజుకు ఒకసారి, 29 పట్టణాల్లో రోజుకు రెండు సార్లు, 43 పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి చొప్పున మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపూర్‌లలో మూడు రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.

➡️