వణికిస్తున్న ‘మిచౌంగ్‌’

Dec 4,2023 10:49 #Michaung Cyclone, #Trembling
  • నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు
  • గోడకూలి బాలుడి మృతి
  • రేపటికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం
  • పోర్టులో ఒకటో ప్రమాద హెచ్చరిక

ప్రజాశక్తి -యంత్రాంగం : రాష్ట్రాన్ని మిచౌంగ్‌ తుపాన్‌ వణికిస్తోంది. నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రమంతా ఆకాశం మేఘావృత్తమైఉంది. ఆదివారం ఉదయం నుండి కురిసిన వర్షాలతో ఈ రెండు జిల్లాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. మరోవైపు రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం నాటికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం ఒడ్డుకు ప్రజలు వెళ్లరాదని, టూరిస్టులను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. రాష్ట్రంలోని పోర్టులన్నిట్లోనూ ఒకటో నెంబరు హెచ్చరికలను ఎగరవేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి టోల్‌ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచారు. నెల్లూరు జిల్లాలోని 18 మండలాలపై తుపాను ప్రభావం పడింది. ఎడతెరపిలేని వర్షం వల్ల నెల్లూరులోనివైఎస్‌ఆర్‌ నగర్‌, ఎన్‌టిఆర్‌ నగర్‌, పడారుపల్లి, కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. నగరానికి రెండు ఎన్‌టిఆర్‌ఎఫ్‌ బృందాలు, కావలికి ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం చేరుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అత్యధికంగా 128.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ఏర్పేడు మండలం చిందేపాళ్యం యానాది కాలనీలో పూరింటి గోడ కూలి యశ్వంత్‌ (4) దుర్మరణం చెందాడు. తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, కెవిబి పురం, బుచ్చినాయుడు కండ్రిగ, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో పది వేల ఎకరాల్లో వరి పొలలు నీట మునిగాయి. కెవిబి పురం మండలం కోవనూరు సమీపంలో శ్రీకాళహస్తి-పిచ్చాటూరు మార్గంలోని వాగు ప్రమాద స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అవతల వైపు ఉన్న సుమారు 40 గ్రామాలకు శ్రీకాళహస్తి పట్టణంతో సంబంధాలు తెగిపోయాయి. తిరుమలలో గత రెండు రోజులుగా వర్షం, చలిగాలు వల్ల సందర్శకులు గదుల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చిత్తూరు, తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు బీచ్‌ రోడ్డును తాకడంతో ఉప్పాడ బీచ్‌రోడ్డులో రాకపోకలను నిలిపేశారు. తుపాను దృష్ట్యా డిఎంహెచ్‌ఒలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ కమిషనరు జె నివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, మారుమూల ప్రాంతాలు, హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్లలో సరిపడా మందుల్ని ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు. ఈ వారంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందుగానే సమీన ఆస్పత్రులకు తరలించాలన్నారు. పాము కాటు చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను అన్ని పిహెచ్‌సిల్లోనూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

➡️