వలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలి- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

Feb 22,2024 08:07 #revenue minister, #speech

ప్రజాశక్తి – గార, శ్రీకాకుళం రూరల్‌ :వచ్చే ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైతే వలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో బుధవారం నిర్వహించిన గ్రామ, వార్డు వలంటీర్ల పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 80 ఏళ్లు దాటిన వారు పోలింగ్‌ కేంద్రాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించిందని తెలిపారు. అలాంటి వృద్ధులకు వలంటీర్లు సాయం చేసి, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వారికి నచ్చిన పార్టీకి వేయించాలని సూచించారు. ప్రభుత్వంపై కోపంతో ఉన్న వారు పోలింగ్‌ కేంద్రాల్లో వేరే పార్టీ గుర్తుపై నొక్కేయడానికి చూస్తుంటారని చెప్పారు. అలా చేయడానికి వీల్లేకుండా అవసరమైతే వలంటీర్లే ఏజెంట్లుగా ఉండాలన్నారు. అందుకు ఎటువంటి అడ్డూ లేదని తెలిపారు. వలంటీర్లకు సర్వీస్‌ రూల్స్‌ లేవని, ఏ ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛంద సేవ చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్‌, డి.పి దేవ్‌, ఎంపిపిలు జి.రఘురాం, అంబటి నిర్మల, జెడ్‌పిటిసిలు మార్పు సుజాత, రుప్ప దివ్య తదితరులు పాల్గొన్నారు.

➡️