వాలంటీర్లకు మరో నజరానా

Jan 15,2024 12:59 #amaravati, #Nazarana, #volunteers

అమరావతి : గౌరవ వేతనం పెంచి.. ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు ఇటీవల పలు జిల్లాల్లో ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి మరో నజరానా ప్రకటించింది. వాలంటీర్ల అభినందన కార్యక్రమం-2024 పేరుతో ఉత్తమ సేవలు అందించినవారిని మండల, పట్టణ, జోనల్‌, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో సన్మానించి నగదు బహుమతులు అందించనున్నారు. వీరి ఎంపికకు జిల్లాస్థాయి కమిటీలను ప్రభుత్వం నియమించింది. కమిటీకి కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉంటారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందిస్తోంది. ఇది కాకుండా వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలులో చక్కని పనితీరు కనబరిచిన వాలంటీర్లను గుర్తించి ఈ ఏడాది సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలం, పట్టణం, జోనల్‌, నియోజకవర్గం, జిల్లాకు ఒకరిని చొప్పున కమిటీ ఎంపిక చేయనుంది. వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వీరిని సత్కరించనున్నారు. మండల, పట్టణ, జోనల్‌ స్థాయిలో ఎంపికైన వారికి రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున నగదు బహుమతులు పంపిణీ చేయనున్నారు.

➡️