విశాఖ ఉక్కు పరిరక్షణ తథ్యం

Feb 24,2024 08:25 #ukkunagaram, #visakha steel

– జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం గత మూడేళ్లుగా కార్మికులు, వివిధ తరగతుల ప్రజలు, ప్రజాసంఘాలు చేస్తున్న సమైక్య పోరాటం వృథా కాబోదని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే రక్షించుకోవడం తథ్యమని జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు, సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వివి.లక్ష్మీనారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంటు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకు అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 1061వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో మల్కాపురం జోన్‌ పరిధి హెచ్‌పిసిఎల్‌ కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సభ్యులు, పెన్షనర్లు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరానికి లక్ష్మీనారాయణ వచ్చి సంఘీభావం తెలిపి పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ ప్రజల సంపద అని అన్నారు. రూ. మూడు లక్షల కోట్ల విలువ గలిగి, లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ.. విశాఖ అభివృద్ధిలో స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. దీనిని కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం ప్రజా వ్యతిరేక చర్యని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం నిలిపి వేసే వరకూ అందరమూ కలిసి ముందుకు సాగుదామని, ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని చీల్చి ప్లాంట్‌ను ముక్కలు చేసి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, కార్మిక సంఘాలు సమైక్యంగా మోడీ ప్రభుత్వ కుట్రలను భగం చేస్తారని అన్నారు. ఆల్‌ పెన్షనర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు జివిఎన్‌ చలపతి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ ద్రోహం నుంచి స్టీల్‌ప్లాంట్‌ను రక్షించి భవిష్యత్తు తరాలకు అందించటానికి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని, యువత, ప్రజలు పెద్ద ఎత్తున దీనిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ దీక్షల్లో హెచ్‌పిసిఎల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) కార్యదర్శి పి.సురేష్‌, నాయకులు కె.రాము, ఎస్‌.లోకేశ్వరరావు, ఎన్‌వి.రమణ, డి.కిషోర్‌, ఆల్‌ పెన్షనర్స్‌ యూనియన్‌ నాయకులు జివి.రమణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️