వేతనాలు పెంచకుంటే ఆందోళన తప్పదు

– మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-గుంటూరు :మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల పట్ల గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏళ్ల తరబడి వివక్షత చూపుతున్నాయని, వేతనాలు పెంచకుంటే ఆందోళన తప్పదని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ఇటీవల మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇంజనీరింగ్‌ కార్మికుల వేతనాల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది అధికారుల కమిటీ ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని, వాటిని సవరించి, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల రాష్ట్ర సదస్సు గుంటూరులోని యుటిఎఫ్‌ కార్యాలయంలో శనివారం జరిగింది. ఇంజనీరింగ్‌ విభాగం జిల్లా కన్వీనర్‌ పి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విభాగంలోని పంపు వాల్వ్‌ ఆపరేటర్‌, బోరు మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, పిట్టర్‌ కార్మికులకు స్కిల్డ్‌ కార్మికుల కేటగిరీలో రూ.21,500 ఇవ్వాల్సి ఉందని, కానీ కమిటీ వీరికి రూ.18 వేలు ప్రతిపాదించిందని తెలిపారు. పార్కుల్లో పనిచేసే కార్మికులు సెమీస్కిల్డ్‌ క్రిందకు వస్తారని, కానీ అన్‌స్కిల్డ్‌ కార్మికుల కేటగిరీలో రూ.15 వేలు ప్రతిపాదించారని అన్నారు. వీరికి రూ.18,500లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కమిటీ ప్రతిపాదనలను సవరించి, ఎన్నికల కోడ్‌ వచ్చేలోగా వేతనాలు పెంచి, జిఒ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సదస్సులో సంఘం రాష్ట్ర కోశాధికారి ఎస్‌.జ్యోతిబసు, మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు పాల్గొన్నారు.

➡️