వేధింపులను తట్టుకోలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

చారకొండ (నాగల్‌ కర్నూలు) : తోటి విద్యార్థినుల వేధింపులను తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలో జరిగింది. సిఐ సోమ నర్సయ్య వివరాల ప్రకారం … చారకొండ మండల కేంద్రానికి చెందిన అనూష (23) హైదరాబాద్‌ షేర్‌గూడలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. రంగారెడ్డి జిల్లా మంగలపల్లిలోని ఓ వసతి గృహంలో ఉంటోంది. అయితే కళాశాల, వసతిగృహాల్లోని తోటి విద్యార్థినులు తనను వేధిస్తున్నారంటూ సోదరుడు విజేందర్‌గౌడ్‌కు అనూష చెప్పింది. విజేందర్‌గౌడ్‌ ఆదివారం రాత్రి అనూషను ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులను సోదరుడు పొలం వద్ద వదిలిపెట్టేందుకు వెళ్లాడు. అతడు తిరిగి ఇంటికి వచ్చేసరికి అనూష ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది. తండ్రి యాదయ్యగౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వివరించారు.

➡️