వైసిపికి ‘వేమిరెడ్డి’ రాజీనామా

Feb 22,2024 08:11 #Resign To YCP, #vemareddy

– ఆయన సతీమణి కూడా..

– ముఖ్యమంత్రికి లేఖ

ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి :ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపికి నెల్లూరు జిల్లాలో మరో ఎదురుదెబ్బ తాకింది. రాజ్యసభ సభ్యులు, వైసిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా లేఖ పంపారు. టిటిడి బోర్డు సభ్యులుగా ఉన్న ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కూడా ఆ పదవితో పాటు వైసిపికి రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నం నెల్లూరులోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జిల్లా అధ్యక్షత పదవి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖను పంపినట్లు తెలిపారు. ‘వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ‘ ఆయన లేఖలో పేర్కొన్నారు. వైసిపి తరపున నెల్లూరు ఎంపి పదవికి పోటీ చేస్తున్నట్లు కూడా గతంలో ఆయన ప్రకటించారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల విషయంలో ఆయన అభిప్రాయాన్ని వైసిపి అధిష్టానం తీసుకోలేదని సమాచారం. ఇటీవల నెల్లూరు నగర సమన్వయ కర్తగా ఎండి ఖలీల్‌ను నియమించారు. దీనికి సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వైసిపికి రాజీనామా చేసిన వెంటనే టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆయనను టిడిపిలోకి ఆహ్వానించారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సొదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి కూడా వేమిరెడ్డి ఇంటికి వెళ్లి స్వాగతించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మాగుంట లేవుట్‌లోని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాసానికి ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌, నగరం, సర్వేపల్లి, కోవూరుతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి పెద్దఎత్తున వేమిరెడ్డి నివాసానికి అభిమానులు, టిడిపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. త్వరలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

➡️