సిద్ధం సభలో ప్రయాణికుల పాట్లు

Mar 11,2024 08:01 #guntur, #siddam

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన వైసిపి సిద్ధం సభకు ప్రజలను తొడ్కొని వెళ్లేందుకు 70 శాతం ఆర్‌టిసి బస్సులను ఆ పార్టీ నేతలు తీసుకోవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం వెయ్యి బస్సులు ఉండగా 700 బస్సులు మేదరమెట్లకు పంపారు. ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి వైసిపి నేతలు, ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు వీటిని అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బస్సులు లేక ప్రజలు ప్రత్యామ్నాయంగా ప్రయివేటు వాహనాలను ఆశ్రయించారు. గుంటూరు, మంగళగిరి, తెనాలి, నర్సరావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, బాపట్ల, రేపల్లె తదితర డిపోల నుంచి మేదరమెట్ల సభకు 700 బస్సులను కేటాయించారు. .సిద్ధం సభ సమాచారం తెలియక చాలా మంది ప్రయాణికులు బస్‌స్టాండ్లకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి ఉండగా ఒక్కోమార్గంలో ఒకటి రెండు బస్సులు రావడం వల్ల తీవ్రమైన రద్దీతో ప్రయాణించాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ మళ్లింపులతో ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చెన్నై వైపు వెళ్లాల్సిన వాహనదారులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభ మధ్యాహ్నం మూడు గంటలకైతే గుంటూరు, బాపట్ల జిల్లా అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి వాహనాలను మళ్లించారు.

➡️