స్వీయ అధ్యయనాన్ని పెంచుకోవాలి – రెడ్‌బుక్స్‌ డేలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Feb 21,2024 22:08 #cpm v srinivasarao, #speech

-నీలం నోట్‌బుక్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అధ్యయనం అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 21 రెడ్‌బుక్స్‌ డే సందర్భంగా బాలోత్సవ భవన్లో జరిగిన కార్యక్రమంలో లెనిన్‌ పెట్రోగ్రాడ్‌లో జరిపిన అజ్ఞాత జీవితానికి సంబంధించిన రచన ‘నీలం నోట్‌బుక్‌’ను శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి, కె ప్రభాకరరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సోవియట్‌ రచయిత కజకేవిచ్‌ చేసిన ఈ రచనను నిడమర్తి ఉమారాజేశ్వరరావు తెలుగులోకి అనువదించారు. ఆవిష్కరణ అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 1848 ఫిబ్రవరి 21వ తేదీన వచ్చిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచాన్ని కుదిపేసిందని, దాన్ని చారిత్రాత్మక దినంగా భావించి నాలుగేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్‌బుక్స్‌డే నిర్వహిస్తున్నామని తెలిపారు. కమ్యూనిస్టులు అధ్యయనాన్ని అలవర్చుకోవాలని, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడంలో అధ్యయనం కీలకంగా ఉంటుందని, అలా మార్చుకోగలిగిన వారే కమ్యూనిస్టులని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం ప్రతికూలతను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కార్యకర్తలను, ఉద్యమాలను బలోపేతం చేసుకోవడానికి అధ్యయనం ఆయుధంగా ఉంటుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు, విప్లవ సాహిత్యానికి ఇప్పుడు ప్రశస్తి పెరిగిందని అన్నారు. నేడు యువతపై సోషల్‌ మీడియా, డ్రగ్స్‌ ప్రభావాలు పడుతున్నాయని, వాటి నుండి యువతను సరైన మార్గంలో నడిపించడంలో సరైన పుస్తకాల అధ్యయనం ముఖ్యమని తెలిపారు. కెరీరిజం పుస్తకాలు, సినిమాల ప్రభావమూ ఎక్కువగానే ఉంటోందని, ఇటువంటి తరుణంలో కమ్యూనిస్టు సాహిత్య అధ్యయనం యొక్క ప్రాధాన్యతను వారికి వివరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రష్యా విప్లవంలోనూ, చైనా విప్లవంలోనూ ఉద్యమం వెనుకబడ్డ సమయంలో అక్కడి నాయకత్వం కార్మికవర్గాన్ని, సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం సాహిత్యాన్ని సాధనంగా వాడుకున్నారనే విషయాన్ని మరువకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు లెనిన్‌ రచనలను ప్రతినెలా కనీసం ఒకటన్నా చదవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ కె లక్ష్మయ్య స్వాగతం పలకగా, ఎంబివికె బాధ్యులు యువి రామరాజు అధ్యక్షత వహించారు.

➡️