క్రిటికల్‌ కంపెనీకి 100కోట్లు

May 6,2024 22:39 #Land Titling Act, #TDP, #vijay kumar
  • ల్యాండ్‌ టైటిల్‌ ముసుగులో అప్పగింత
  • టిడిపి నేత విజయ్ కుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముసుగులో క్రిటికల్‌ రివర్‌ కంపెనీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.100కోట్లకు పైగా దోచిపెట్టారని టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్‌ విమర్శించారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూపత్రాలు డిజిటలైజ్‌ చేసి భద్రపరిచే కాంట్రాక్టు తమకే ఇచ్చారని క్రిటికల్‌ రివర్‌ సంస్థ బహిరంగ ప్రకటన చేసే వరకు ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ ఇస్తామని చెప్పిన భారత ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీని కాదని అన్‌లిస్టెడ్‌ ప్రైవేట్‌ కంపెనీకి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి మూడు సార్లు కేంద్రం ఆమోదానికి పంపింది వైసిపి ప్రభుత్వమేనని టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ బిల్లు ఆశయాలు గొప్పవని తమ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారని, అందులో తప్పేముందని అన్నారు. జగన్‌ హయాంలో ఆర్యవైశ్యుల అభివృద్ధి నీర్వర్యమయిందని టిడిపి రాష్ట్రవాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్‌ విమర్శించారు. టిడిపి ప్రభుత్వంలోనే ఆర్యవైశ్యుల అభివృద్ధి సాధ్యమని అన్నారు.

విట్‌ పరీక్షల తేదీలు మార్చాలి
తమిళనాడు, అమరావతిలోని విట్‌ యూనివర్సిటీ విద్యార్ధులకు ఈ నెల 14వ తేదిన జరగనున్న పరీక్షల తేదీలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను టిడిపి నేతలు కోరారు. మీనాను సచివాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ నెల 13వ తేదిన ఓటు వేసి తిరిగి 14వ తేదిన పరీక్షలకు హాజరుకావడం సులభంకాదని తెలిపారు. చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌కు పేపర్లు ఇవ్వకుండా ఇఎంను ఉపయోగించిన తాహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు వర్ల రామయ్య, ఏఎస్‌ రామకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, బుచ్చి రాంప్రసాద్‌, అఖిల్‌, మన్నవ సుబ్బారావు, బండారు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.

➡️