వైసిపి నుంచి 134 కుటుంబాలు సిపిఎంలో చేరిక

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని నాలుగు గిరిజన గ్రామాలకు చెందిన 134 కుటుంబాలు సోమవారం వైసిపి నుంచి సిపిఎంలో చేరాయి. గంగాపురం పంచాయతీ పనసభద్ర గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె సుబ్బారావమ్మ, రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం కృష్ణమూర్తి, రావికోన పంచాయతీ సర్పంచ్‌ కె రామస్వామి సమక్షంలో ఆయా కుటుంబాల వారికి సిపిఎం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నాయకులు పాలమెట్ట రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగాపురం, ములగ, వెలగవలస, సంగం వలస పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లు, ప్రజలు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన గిరిజనులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా తమ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావడంలేదని, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకే సిపిఎంలో చేరామని తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ వద్దకు వచ్చి మీ సమస్యలు చెప్పండి అంటున్నారు తప్ప పరిష్కరించడం లేదని అన్నారు. సిపిఎంలో ఉండి పోరాటాల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. సుబ్బరావమ్మ మాట్లాడుతూ బిజెపి మతం, కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య తగాదాలు పెట్టి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. అందుకే బిజెపితో పాటు ఆ పార్టీతో పొత్తు, తొత్తుగా ఉన్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పి రాము, మెలిక రాము, చిరంజీవి, కొండ గొర్రి వెంకటి, కొండ గొర్రి రాజప్ప, పూల భాస్కరరావు, గొల్లది సింహాచలం, తాడిం రాము, కోలక కృష్ణ, కోలక కళావతి, కోలక సిమ్మలు పాల్గొన్నారు.

➡️