16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

Mar 12,2024 21:45 #Dharna, #sarpanchula

– కడప కలెక్టరేట్‌ ఎదుట సర్పంచుల ధర్నా

– నిధులను దారిమళ్లించే అధికారం ఎవరిచ్చారు : రాజేంద్రప్రసాద్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌: న్యాయబద్ధమైన 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్‌ ఎదుట ఉమ్మడి జిల్లాల సర్పంచులు మంగళవారం ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను దారి మళ్లించి, గ్రామాల అభివృద్ధిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా, స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే సొంత నిధులను, 14, 15వ ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, సర్పంచుల ఆధ్వర్యంలో వారు విధులు నిర్వహించాలన్నారు. జగన్‌ను ఇంటికి పంపితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటమి అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా వైసిపి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గ్రామ వలంటీర్లను, గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేసి, సర్పంచుల ఆధ్వర్యంలో అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ సింగంశెట్టి సుబ్బరామయ్య, ఉమ్మడి జిల్లా పంచాయతీ సర్పంచులు పాల్గొన్నారు.

➡️