2014 ఎన్నికలు – రాష్ట్ర విభజన – కాంగ్రెస్‌ ఓటమి

2009 ఎన్నికల అనంతరం కొద్ది నెలలకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తరువాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని భావించారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించింది. దీంతో వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని స్థాపించారు. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైసిపిలో చేరారు. అలా చేరిన వారందరితో తమ పదవులకు రాజీనామా చేయించారు. ఆ స్థానంలో వచ్చిన 18 ఉప ఎన్నికల్లో వైసిపి 15 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైసిపిలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్‌ బలహీనపడి వైసిపి బలపడింది. పాలక కాంగ్రెస్‌కు గట్టి సవాలు విసిరి తాను బలపడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడం ప్రారంభించిన దశ అది.

టిడిపి, వైఎస్‌ఆర్‌సిపికి మధ్య స్వల్ప ఓట్ల తేడా
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు జమిలిగా 2014 ఏప్రిల్‌ 30, మే 7 తేదీల్లో జరిగాయి. 175 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. టిడిపి 102 స్థానాలు గెలిచి, 1,29,16,000 (44.90 శాతం) ఓట్లు సంపాదించింది. వైఎస్‌ఆర్‌సిపి 67 స్థానాలు గెలుచుకొని 1,28,40,033 (44.60 శాతం) ఓట్లు సాధించింది. సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపిస్తున్నా.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. టిడిపితో వైసిపి హోరాహోరీగా పోటీనిచ్చింది. తెలుగుదేశం
పార్టీతో పొత్తు పెట్టుకున్న బిజెపి 4 సీట్లు గెలిచింది. ఈ పార్టీకి 6,32,599 (2.20 శాతం) ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు 2 స్థానాలు గెలిచారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఐ(ఎం), సిపిఐ, బిఎస్‌పిలకు సీట్లు రాలేదు. 2009 ఎన్నికల్లో 60 లక్షలకు పైచిలుకు ఓట్లు తెచ్చుకుని 18 అసెంబ్లీ సీట్లు గెలిచిన చిరంజీవి 2008లో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ 2011 ఆగస్టులో కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది. అందువల్ల 2014 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీలో లేకుండా పోయింది. అయితే అంతకుముందే చిరంజీవి రాజ్యసభకు కాంగ్రెస్‌ సభ్యుడుగా ఎంపికై కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. జనసేన పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టిడిపి, బిజెపికి మద్దతిచ్చారు.
ఇక అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్‌సభ జమిలిగా జరిగిన ఎన్నికలకు సంబంధించి 25 సీట్లకుగాను టిడిపి 15 స్థానాలను గెలిచింది. 1,17,29,230 (40.80శాతం) ఓట్లు సంపాదించింది. వైసిపి 8 సీట్లు, 1,31,31,029 (45.67శాతం) ఓట్లు సాధించింది. బిజెపి 2 స్థానాల్లో విజయం సాధించి 20,77,079 (7.22 శాతం) ఓట్లు పొందింది. కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఐ(ఎం) వంటి జాతీయ పార్టీలకు స్థానాలు రాలేదు.

కెసిఆర్‌ నిరాహారదీక్ష – రాష్ట్ర విభజన
తెలంగాణా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి 2001 ఏప్రిల్‌ 21న రాజీనామా చేసి తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)ని ఏర్పాటు చేసి యావత్‌ తెలంగాణా ప్రాంతాన్ని ఉద్యమ బాట పట్టించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించి 2004 నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాడు. 2009 ఎన్నికల అనంతరం కెసిఆర్‌ మలిదశ ఉద్యమం తీవ్రం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2009 డిసెంబరు 9న అంటే నిరాహారదీక్ష 11 రోజులు పూర్తయిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్‌ 2న రాష్ట్ర విభజన జరిగినట్లు అదే యేడు మార్చి 1న నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ఉత్తర్వు ఇచ్చారు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. అనేక దశాబ్దాలుగా రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేసిన, చేస్తున్న వామపక్షాలతో కలిసి ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. తాను తెలంగాణా రాష్ట్రం ఇచ్చినందుకు తనకు బ్రహ్మరథం పడతారని భావించిన కాంగ్రెస్‌ పార్టీ 2014 ఎన్నికల్లో ఎపిలోనూ, తెలంగాణాలోనూ రెండు రాష్ట్రాల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 1953నాటి భౌగోళిక ఆంధ్రరాష్ట్ర స్వరూపం కలిగి ఉండి చిన్న రాష్ట్రంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 294 సీట్ల నుంచి 175 స్థానాలకు పడిపోయింది. లోక్‌సభ స్థానాల సంఖ్య 42 నుంచి 25కి పడిపోయింది.

– యు. రామకృష్ణ

➡️