2047 నాటికి స్వావలంబనే లక్ష్యం

  • వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో గవర్నర్‌

ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌ (తిరుపతి జిల్లా): 2047 నాటికి భారత్‌ మహాశక్తివంతమైన దేశంగా నిలవనున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికార యంత్రాంగం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సోమవారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ అందేలా అవగాహన కల్పించడం ఈ యాత్ర లక్ష్యమన్నారు. కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, మాట్లాడుతూ.. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేలా తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ముందు ‘మన సంకల్పం…వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి నగర పాలక సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మెప్మా, డిఆర్‌డిఎ, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ తదితర శాఖలు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాల్‌లను గవర్నర్‌ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొంది జీవన ప్రమాణాలను పెంపొందించుకుని ఆదర్శంగా నిలిచిన లబ్ధిదారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ భారతి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ హరిత, గ్రామ పంచాయతీ అధికారి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️