రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం

  • లంచాలిస్తే తప్ప రైతులు పంట అమ్ముకోలేని దుస్థితి
  •  ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం
  •  నరసాపురం, పాలకొల్లు పర్యటనల్లో టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో 2019 నుంచి ఉద్యోగావకాశాలు లేకుండా యువతను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగత ఉందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్‌సి నిర్వహిస్తామని, సర్వీసు కమిషన్‌ ఉద్యోగాలన్నీ భర్తీ చేయడంతో పాటు ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లులో ఆయన పర్యటించారు. ఆయా చోట్ల నిర్వహించిన సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిపోయాయన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం వెనక్కుపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ రైతూ బాగోలేరని, అన్నదాత సంక్షోభంలో కూరుకుపోయారని, గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని విమర్శించారు. లంచాలు ఇచ్చి రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితికి సిఎం తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. 2014లో రుణమాఫీతోపాటు రైతురథం కింద ట్రాక్టర్లు, భూసార పరీక్షలు నిర్వహించామని, ఆక్వా, ఉద్యాన పంటలను అభివృద్ధి చేశామని అన్నారు. 2014-18లో ఆక్వారంగం దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. వైసిపి ప్రభుత్వంలో ఆక్వాసీడ్‌, ఫీడ్‌, సెస్‌, ట్రాన్సఫార్మర్ల ధరలు, విద్యుత్‌ ఛార్జీలు పెరిగిపోయాయని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఆక్వాకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. భూ హక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టెస్తారని, తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని తెలిపారు. ప్రతిఒక్కరికీ రెండు సెంట్ల ఇంటి పట్టా ఇస్తామని హామీ ఇచ్చారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, ఇసుక, ఇంటి స్థలాల్లో దోపిడీ చేశారని ఆరోపించారు.

చంద్రబాబుకు అసమ్మతి సెగ
గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో టిడిపి అధినేత నారా చంద్రబాబుకు అసమ్మతి సెగ తగిలింది. పాలకొల్లు, నరసాపురం పర్యటనకు వెళ్లేందుకు నల్లజర్లలోని స్థానిక ఎకెఆర్‌జి కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు కాన్వారులో బయలుదేరారు. ఈ సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్‌పి మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అనుచరులు చంద్రబాబు కాన్వారుని అడ్డుకున్నారు. మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ నినదించారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదు. ఇష్టమైన వారు సహకరించండి కష్టమైతే తప్పుకోండి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఒకానొక దశలో ఓ కార్యకర్తపై ‘గెట్‌ అవుట్‌’ అంటూ సీరియస్‌ అయ్యారు.

పింఛను జాప్యంపై సిఇఒ విచారణ చేపట్టాలి : చంద్రబాబు
పింఛను జాప్యం, పింఛనుదారుల మరణాలపై సిఇఒ విచారణ చేపట్టాలని చంద్రబాబు కోరారు. తాము అధికారంలోకి వస్తే పింఛనును నాలువేలకు పెంచుతామని, ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు కూడా ఈ పింఛనును వర్తింపజేస్తామని తెలిపారు. రాజకీయ కుట్రతో పింఛనుదారుల మరణాలకు జగన్‌మోహన్‌రెడ్డి కారకుడయ్యారని ఆరోపించారు. సిఎం పదవికి రాజీనామా చేసి తక్షణమే వైదొలగాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మార్చితో బడ్జెట్‌ ముగుస్తుందని తెలిసినా ముందుగానే ఎందుకు నిధులు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛను ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్‌ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.

టిడిపిలోకి రఘురామకృష్ణంరాజు
నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు టిడిపిలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నుంచి తప్పించి రఘురామకృష్ణంరాజుకు టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారమూ జోరుగా సాగుతోంది. రఘురామ చేరికతో ఇటు మంతెన రామరాజుకు లేదా భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్‌ గల్లంతు కావడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.

➡️