అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌

  • 30 మందికి తీవ్ర అస్వస్థత

ప్రజాశక్తి – ఏర్పేడు (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులపాలెం టోల్‌గేట్‌ పక్కన నిర్మించిన సిఎంఆర్‌ ఇకొ అల్యూమినియం ఫ్యాక్టరీలో శనివారం గ్యాస్‌ లీకై 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 25 మంది మహిళలు ఉన్నారు. ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిఎంఆర్‌ ఇకొ అల్యూమినియం కర్మాగారంలో అల్యూమినియం అల్లోరు ప్రైమరీ మెటీరియల్‌ తయారవుతుంది. స్క్రాప్‌ మెటీరియల్‌ను కరిగించేందుకు వేస్ట్‌ ఆయిల్‌ను వాడతారు. ఈ ఆయిల్‌ను మండించేందుకు గ్యాస్‌ను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం స్క్రాప్‌ మెటీరియల్‌ను కగిరించే సమయంలో ఎక్కువ గ్యాస్‌ లీకేజ్‌ అవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వీరిని రేణిగుంటలోని బాలాజీ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసేవారంతా ఎక్కువమంది ‘నాన్‌ లోకల్‌’ కావడం గమనార్హం.

బాధితులను పరామర్శించిన ఎంపి మద్దిల గురుమూర్తి
రేణిగుంట బాలాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపి మద్దిల గురుమూర్తి పరామర్శించి ధైర్యం చెప్పారు. అత్యుత్తమ చికిత్స అందించాలని యాజమాన్యాన్ని కోరారు. అనంతరం సిఎంఆర్‌ కర్మాగారం ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలుసుకున్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
బాధితులకు న్యాయం చేయాలి : రంగయ్య, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు
రైతుసంఘం జిల్లా నాయకులు రంగయ్య, రాంబాబు, వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటనల చోటుచేసుకుందని అన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించి, న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️