సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో కోటి 50 లక్షలు మాయంపై బాధితుల ఆందోళన

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీ లో ఉన్న సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో ఖాతాదారుల ఖాతాలో నగదు మాయమవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పైలాన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో సబ్‌ పోస్ట్‌మాస్టర్‌గా అప్పట్లో విధులు నిర్వహించిన రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి కోటి 50 లక్షలు మాయం చేశారు. దీనిపై గురువారం హిల్‌ కాలనీలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఏడాదికి పైగా ఖాతాదారుల నుండి నగదు మాయం చేస్తున్న సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోలేదని ఖాతాదారులు వాపోతున్నారు. ఖాతాలో నగదు మాయమైందనే విషయం తెలిసి 20 రోజులు గడుస్తున్న పోస్టల్‌ అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అతనిపై గతంలో ఫిర్యాదు చేసినా పోస్టు ఆఫీస్‌ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తమ నగదును మాయం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి, తమ నగదు తమకు ఇప్పించాలని ఖాతాదారులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పైలాన్‌ కాలనీలోని సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో రామకృష్ణ సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ గా గత రెండు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. ఆఫీస్‌ కు వచ్చే ఖాతాదారులు దాచుకునే డబ్బులు ఖాతాదారుల పాస్‌ పుస్తకాలు ఆన్లైన్లో నమోదు చేయకుండా ఏదో ఒక సాకుతో కంప్యూటర్‌ పనిచేయడం లేదని తర్వాత రాసి ఇస్తానని చెబుతూ ఖాతాదారులను నమ్మబలికాడు. ఖాతాదారులు అతనిపై నమ్మకంతో డబ్బుకు చెల్లించి వచ్చేవారు. అయితే కొద్ది రోజులుగా సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ రామకృష్ణ సెలవులో ఉండడంతో అతని స్థానంలో ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న మరో సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ రంగయ్య పోస్ట్‌ ఆఫీస్‌ లో తాము జమ చేసిన నగదు ఖాతాలో ఉన్న నగదులో తేడా రావడంతో ఖాతాదారులు సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ రంగయ్యకు ఫిర్యాదు చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోస్టల్‌ ఇనిస్పెక్టర్‌ మదన్మోహన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ రికార్డులను పరిశీలించిన తరువాత అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.

➡️