జొన్న ఇగురు తిని 80 గొర్రెలు మృతి

Mar 20,2024 07:56 #Anantapuram District

ప్రజాశక్తి-బెలుగుప్ప (అనంతపురం జిల్లా) : జొన్న ఇగురుతిని 80 గొర్రెలు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం గ్రామ సమీపాన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్రెల యజమాని తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కందూకూరు మండలం పి.వెంకటంపల్లి తండాకు చెందిన లాల్య నాయక్‌ మేత నిమిత్తం గొర్రెల మందను బళ్లారి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మేత అనంతరం సోమవారం నాడు స్వగ్రామం తిరుగు ప్రయాణం అయ్యాడు. చీకటి పడడంతో బెలుగుప్ప మండలం గంగవరం గ్రామ సమీపంలో రాత్రి గొర్రెల మందతో కలిసి నిద్రించారు. వీరు నిద్రించిన ప్రాంతంలో ఓ పొలంలో ఎండిన జొన్నను దున్నేశారు. ఈ జొన్న ఇగురును గొర్రెలు తిన్నాయి. తిన్న వెంటనే 49 గొర్రెలు ఘటనా స్థలంలోనే మరణించాయి. ఇది గమనించిన గొర్రెల కాపరి పశువైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌కు సమాచారం అందించారు. వారు మంగళవారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మరో 31 గొర్రెలు మృతి చెందాయి. మొత్తం 80 గొర్రెలు మృతి చెందడంతో దాదాపు రూ.10.50 లక్షలు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి కన్నీటి పర్యవంతం అయ్యాడు. గొర్రెల మృతి విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం ప్రాంతీయ పశు వైద్యశాల సహాయసంచాకులు డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన గొర్రెలకు శవపరీక్ష నిర్వహించారు.

➡️