వైసిపి దుర్మార్గ పాలన ఇక83 రోజులే : చంద్రబాబు

Jan 19,2024 09:57 #83, #more days, #Nara Chandrababu, #speech
  • వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే
  • ‘రా… కదిలిరా’ సభలో చంద్రబాబు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వైసిపి పాలనలో ప్రతిఒక్కరూ నష్టపోయారని, రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రూ.4 లక్షల నుండి రూ.6 లక్షల వరకూ భారం మోపారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ‘రా… కదిలిరా’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ మల్లాయపాలెం వద్ద బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. వైసిపి పాలనలో రాష్ట్ర ప్రజల ఆదాయాలు పెరగలేదని, కానీ, దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా జగన్‌ ఎదిగారని తెలిపారు. ప్రజలకు రూ.10 పంచి వారిపై రూ 100 పన్నుల భారం మోపారని దుయ్యబట్టారు. విద్యుత్‌, బస్సు ఛార్జీలు, నిత్యావసరాలు, మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి పడకేసిందని, పోలవరం, రాజధాని ప్రాజెక్టులను ముంచేశారని విమర్శించారు. జాబ్‌ కేలండర్‌ ప్రకటించలేదని, ఒక్క డిఎస్‌సి కూడా నిర్వహించలేదని అన్నారు. అర్హతలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో ఈ ఐదేళ్ల పాలన చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. వైసిపి దుర్మార్గపాలనకు 83 రోజులే గడువు ఉందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు టిడిపి-జనసేన నాయకులు, కార్యకర్తలు విశ్రమించకుండా ఇంటింటికీ తిరిగి వైసిపి దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించాలని కోరారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సంపదతోపాటు ప్రజల ఆదాయాలను కూడా పెంచుతామన్నారు. పేదరికంలేని సమాజం నిర్మిస్తామని, పేదరికం నుంచి ప్రజలను బయటపడేసేందుకు వికాసం అనే కార్యక్రమాన్ని తీసుకొస్తామని అన్నారు. టిడిపి-జనసేన పొత్తుతో జగన్‌కు దడపుట్టిందని పేర్కొన్నారు. టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన వంద సంక్షేమ పథకాలను జగన్‌ రద్దు చేశారని విమర్శించారు. టిడిపి-జనసేన అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌టిఆర్‌కు నివాళులుటిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టి.రామారావు 28వ వర్ధంతిని కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వర్ల రామయ్య, కనకమేడల రవీంద్ర, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️