ట్విట్టర్‌లో అభిమాని పిలుపు.. ఇంటికెళ్లి ఆతిథ్యం తీసుకున్న కెటిఆర్‌

Jan 8,2024 12:20 #call, #fans, #home, #KTR, #Twitter

బోరబండ (తెలంగాణ) : ఓ అభిమాని పిలుపుకు స్పందించిన బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ఆయన ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. గతంలో దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరా పింఛను ఇప్పించాలంటూ … ఇబ్రహీంఖాన్‌ అనే వ్యక్తి ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి కెటిఆర్‌ కార్యాలయం వెంటనే స్పందించి పింఛన్లను మంజూరు చేయించింది. ఈ విషయాన్ని ఇబ్రహీంఖాన్‌ ట్విట్టర్‌లో గుర్తుచేశారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా … కెటిఆర్‌కు జనవరి 2వ తేదీన ‘ఎక్స్‌’లో శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్‌లోని బోరబండ బంజారానగర్‌కు చెందిన ఇబ్రహీంఖాన్‌.. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్‌ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కెటిఆర్‌ వెంట జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, నాయకులు ఉన్నారు.

అభిమాని ఇంటికి ఆతిథ్యానికి వెళ్లడంపై కెటిఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ” ఇబ్రహీంఖాన్‌ భారుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. బోరబండలోని ఆయన ఇంటికి వెళ్లాను. ఆప్యాయతతో రుచికరమైన బిర్యానీ, షీర్‌ ఖుర్మా అందించిన అతడి కుటుంబాన్ని కలిశాను. ఆహారం, ఆతిథ్యం నచ్చాయి. వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇబ్రహీంఖాన్‌ సోదరుడి పిల్లలకు సహాయం చేస్తానని మాటిచ్చాను ” అని తెలిపారు.

కెటిఆర్‌ తన ఇంటికి రావడంపై ఇబ్రహీంఖాన్‌ స్పందిస్తూ … దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరా పింఛను ఇప్పించాలని గతంలో ఎక్స్‌ వేదికగా కోరగా కెటిఆర్‌ కార్యాలయం తక్షణమే స్పందించిందని తెలిపారు. పిల్లల చికిత్సకు అవసరమైన సాయం చేసేందుకు కెటిఆర్‌ భరోసా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

➡️