తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మేడిగడ్డకు బయల్దేరిన సీఎం బృందం

Feb 13,2024 11:32 #CM Revanth Reddy, #medigadda tour

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడ్డాయి. నేడు (మంగళవారం) ఓట్‌ ఆన్‌ అకౌంట్‌పై చర్చ జరగాల్సి ఉండగా… చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్‌ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం సభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. ఆపై మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ నుంచి నాలుగు బస్సుల్లో వీరు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు వీరు తిరిగి హైదరాబాద్‌ కు బయలుదేరుతారు. ఈ పర్యటనకు బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు.

కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా పెట్టాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర రావు (హరీశ్ రావును ఉద్దేశించి) లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలని కోరారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ఓ హెలికాఫ్టర్ ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని చెప్పారు. ఈమేరకు మంగళవారం ఉదయం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనుగొన్నారని, దాంతో ప్రాజెక్టు అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు ఏర్పడిందని ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారని గుర్తుచేశారు.

➡️