28న ఉమ్మడి బహిరంగ సభ

Feb 23,2024 10:07 #28, #amaravati, #joint public meeting
  • తాడేపల్లిగూడెంలో నిర్వహణకు టిడిపి-జనసేన నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 28వ తేదిన ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్ణయించాలని టిడిపి-జనసేన నిర్ణయించాయి. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం జరిగింది. తాడేపల్లిగూడెం వద్ద పత్తిపాడులో ఈ సభను పెద్దఎత్తున నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమావేశం అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, జనసేన పిఎసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ ఇరు పార్టీల నుంచి 12 మంది బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ కావాలనే లక్ష్యంతో పూర్తిసమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇదే ఉత్సాహాన్ని ప్రజల్లో నింపేలా తాడేపల్లిగూడెం సభ ఉండబోతుందన్నారు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి మానిఫెస్టో, సీట్ల కేటాయింపుపై ఇరుపార్టీల అధినేతలు త్వరలో పూర్తివివరాలను వెల్లడిస్తారని తెలిపారు. పార్టీ అధినేతల నుంచి ప్రకటన వెలువడే వరకు ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కలిసిపనిచేయాలని కోరారు. తమ కూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక విడదీయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ఈ వాస్తవాలను పార్టీశ్రేణులు గ్రహించి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ దుష్ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని కోరారు. రెండు పార్టీల పొత్తును స్వాగతిస్తూ ఒక తీర్మానాన్ని, మీడియాపై జగన్‌ ప్రభుత్వం చేస్తున్న దాడుల్ని నిరసిస్తూ మరో తీర్మానాన్ని ఈ సమావేశంలో చేసినట్లు తెలిపారు. నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి నుంచి యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, జనసేన నుంచి బి మహేందర్‌ రెడ్డి, కందుల దుర్గేష్‌, బొమ్మిడి నాయకర్‌, కొటేకలపూడి గోవిందరావు, పాలవలస యశస్వి పాల్గొన్నారు.ఎన్డీఎలోకి టిడిపికి ఆహ్వానం అందింది ఎన్డీఎ కూటమిలోకి చేరాలని తమ పార్టీని ఆహ్వానించారని టిడిపి రాష్ట్రఅధ్యక్షులు కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ ‘జనసేన ఇప్పటికే ఎన్‌డిఎలో ఉంది. తెలుగుదేశంకు కూడా ఎన్‌డిఎ నుండి ఆహ్వానం అందింది. అది మాట్లాడటానికే మా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు’ అని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయని అన్నారు.

➡️