సమస్యలు పరిష్కరించకుంటే సంక్రాంతి తరువాత సమ్మె

Jan 5,2024 08:55 #Dharna, #Field assistants

 

– ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల హెచ్చరిక

– పంచాయతీరాజ్‌ కమిషన్‌ కార్యాలయం వద్ద మహా ధర్నా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో సంక్రాంతి తరువాత సమ్మెలోకి వెళతామని ఎపి ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. వేతనాలు పెంచాలని, మ్యాన్‌డేస్‌ పని విధానం రద్దు చేయాలని, ఎఫ్‌టిఇ అమలు చేయాలని, విలీన పంచాయతీల్లో అసిస్టెంట్లను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ గురువారం ఉదయం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం దగ్గర్లో మహాధర్నాకు దిగారు. ముందుగానే అక్కడకు చేరుకున్న అసిస్టెంట్లను పోలీసులు మోహరించడంతో గుంపులు గుంపులుగా చేరి ఒక్కసారిగా ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవాధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. అలాగే మ్యాన్‌డేస్‌ పేరుతో వేధింపులకు దిగుతున్నారని తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఎఫ్‌టిఇ అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా మండలస్థాయిలో బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. వీటిపై ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన హామీనిచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. సంక్రాంతి లోపు సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 18 నుండి సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు లేదా, నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించిన విధంగా రూ.20 వేలు వేతనం చెల్లించాలని కోరారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం పరంధామయ్య మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ తాను అధికారంలోకి వస్తే కనీస వేతనం రూ.26 వేలు చెల్లిస్తామని తెలిపారని, రెగ్యులరైజ్‌ చేస్తామని, మ్యాన్‌డేస్‌ విధానాన్ని రద్దు చేస్తామని తెలిపారని, అయినా చేయలేదని పేర్కొన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అన్నమాట నిలబెట్టుకోవాలన్నారు. వేతనాలు పెరిగేట్లు చూస్తాంకమిషనర్‌ సూర్యకుమారి హామీ మహధర్నా సందర్భంగా నాయకులను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సూర్యకుమారి చర్చలకు ఆహ్వానించారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం నాయకులు ఉమామహేశ్వరరావు తదితరులు సమస్యలు వివరించారు. దీనికి స్పందించిన కమిషనర్‌ వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పెరిగేటట్లు చూస్తామని తెలిపారు. మ్యాన్‌డేస్‌ విధానాన్ని సవరిస్తామని, ఎఫ్‌టిఇ పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. పట్టణాల్లో కలిసిపోయిన గ్రామాలకు సంబంధించిన అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించే అంశాన్ని చూస్తామన్నారు. ఈ విషయాలన్నీ ధర్నా దగ్గరకు వచ్చిన డైరెక్టర్‌ చినతాతయ్య, ఎంఎస్‌ శ్రీవారెడ్డి, జెసి జ్యోతి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కమిషనర్‌ తరపున వివరించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్‌, అధికారులకు యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పరంధామయ్య, బి నరసింహులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదర్‌ బాషా, మహేష్‌, వీరేష్‌, హరిప్రసాదు, గణేష్‌, శివప్రసాదు, రవి, భవానీ తదితరులు పాల్గన్నారు. తాడేపల్లి సిసిఎం నాయకులు వెంకటరెడ్డి తదితరులు ధర్నాకు మద్దతు తెలిపారు.

➡️