శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి నాయకుడు దారుణ హత్య

Mar 25,2024 21:40 #Hatya, #sri satyasai district, #TDP
  • రాజకీయ కక్షతోనే ఘాతుకం : అచ్చెన్నాయుడు, లోకేష్‌ ఆరోపణ
  • వ్యక్తిగత కారణాల వల్లే : డిఎస్‌పి

ప్రజాశక్తి- నల్లమాడ, పుట్టపర్తి అర్బన్‌, అమరావతి బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా పట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కటాలపల్లి గ్రామంలో టిడిపి నాయకుడు ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల వేళ ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. రాజకీయ కక్షతోనే వైసిపి వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని టిడిపి ఆరోపించింది. వ్యక్తిగత కారణాల వల్లే హత్య జరిగినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డిఎస్‌పి తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం… కుటాలపల్లి గ్రామానికి చెందిన దద్దుకుంట అమర్‌నాథ్‌రెడ్డి (40) గతంలో వైసిపిలో ఉండేవారు. ఆరు నెలల క్రితం టిడిపిలో చేరారు. అప్పటి నుంచి టిడిపి నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ క్రియాశీలకంగా పాల్గొనేవారు. ఆదివారం రాత్రి ఆయన గ్రామంలోని తన మామిడి తోటలో నిద్రించారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వేట కొడవలితో నరికి ఆయనను హత్య చేశారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు రక్తపు మడుగులో ఉన్న అమర్‌నాథ్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కటాలపల్లి గ్రామానికి వచ్చి అమర్నాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ హత్య పట్ల టిడిపి నాయకులు మైలే శంకర్‌, డాక్టర్‌ బుట్టి నాగభూషణం నాయుడు, మాజీ ఎంపిపి బ్రహ్మానందరెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, కులశేఖర్‌ నాయుడు తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓటమి భయంతో వైసిపి వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు వేరు ప్రకటనల్లో ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రలు క్షీణించాయని, ప్రతిపక్ష నాయకులపై అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.
రాజకీయ కారణాలు లేవు : డిఎస్‌పి
మృతదేహాన్ని, హత్య జరిగిన స్థలాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్‌పి మాధవరెడ్డి, డిఎస్‌పి వాసుదేవన్‌ పరిశీలించారు. అమర్‌నాథ్‌రెడ్డిని వ్యక్తిగత కారణాల వల్లే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఈ హత్యకు ఎటువంటి రాజకీయ కోణమూ లేదని డిఎస్‌పి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
గ్రామంలో టెన్షన్‌ వాతావరణం
ప్రశాంతంగా ఉండే కటాలపల్లి గ్రామంలో గతంలో ఎప్పుడూ హత్యలు జరగలేదు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో టిడిపి నాయకుడు దారుణ హత్యకు గురవ్వడంతో గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. హత్య విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో కటాలపల్లి గ్రామానికి చేరుకున్నారు. అమర్‌నాథ్‌రెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

➡️