నెల్లూరులో ఘోర అగ్నిప్రమాదం

Jun 20,2024 22:47 #death, #fire acident, #Nellor, #old women
  • వికలాంగురాలు సజీవదహనం
  • రెండు పూరిగుడిసెలు ఆహుతి

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని 5వ డివిజన్‌ బర్మాషల్‌ గుంట ప్రాంతంలోని పేదల పూరిగుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా నల్లటి పొగ కమ్మేయడంతో ఏమి జరుగుతుందోనన్న భయంతో చుట్టు పక్కల వారు, స్థానికంగా ఉన్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఈ కాలనీలో నివసిస్తున్న కొందరు రోజువారి కార్మికులు. మరికొందరు బీడిలు, చుట్టలు చుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నాగలక్ష్మి అనే వికలాంగురాలు ఇంటిలో గ్యాస్‌లీకైంది. దీనికి తోడు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని అతికష్టం మీద మంటలను అదుపుచేసింది.
మంటల్లో చిక్కుకున్న నాగలక్ష్మి (12) బయటకు రాలేక సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో రెండు పూరిగుడిసెలు పూర్తిగా కాలిపోగా 14 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కార్మికులందరూ పనులకు వెళ్లడంతో ఇంటిలోని సామాగ్రి కాలిబూడిదైంది. కలెక్టర్‌ హరినారాయణన్‌ సంఘట స్దలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరుపున సాయం చేస్తామన్నారు. ఘటనాస్థలాన్ని సిపిఎం, జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ పరిశీలించారు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయినవారికి ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించాలని రమేష్‌ విజ్జప్తి చేశారు. బాలిక కుటుంబానికి రూ.50 వేలు, దెబ్బతిన్న ఇళ్లకు రూ.15 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి నారాయణ ప్రకటించారు.

➡️